భారత్ సమాచార్, రాజకీయం : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఈ నెల 25 (శనివారం) జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను రద్దు చేయడంపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో అనేక గాసిప్స్ వినపడుతున్నాయి. హైదరాబాద్ లో మీటింగ్స్ కు హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ కు టైం కలిసి రావడం లేదని టాక్ నడుస్తోంది. ఎప్పుడూ ఏదో కారణంతో సభలను రద్దు చేయడంపై అందరిలో సందేహం నెలకొంటున్నది. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే పబ్లిక్ మీటింగ్ ను వర్షం కారణంగా రద్దు చేసినట్టు పైకి చెబుతున్నప్పటికీ, ఇంటర్నల్ గా ఏదో బలమైన కారణమేదో ఉన్నట్టు ప్రజల్లోనూ, పార్టీ కేడర్ లోనూ చర్చ జరుగుతోంది.
ఈ సభను ఎలాగైనా విజయవంతం చేయాలని సీనియర్ మంత్రులు తలసాని, మహమూద్ అలీ, సిటీ ఎమ్మెల్యేలు భారీగానే ప్రణాళికలు రచించారు. పార్టీ తరపున సమీక్షలు కూడా పెద్ద ఎత్తున చేశారు. సభకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. అయితే ఒక్క రోజు ముందు వర్షం కారణంగా సభను రద్దు చేస్తున్నట్టు గులాబీ అధిష్ఠానం సడన్ గా ప్రకటించింది. అయితే సభకు జనాలు రాకపోతే పార్టీ పరువు పోతుందని ముందే గ్రహించి రద్దు చేసినట్టు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి.
కాగా, సభకు భారీగా జనసమీకరణ కష్టమని, అనుకున్న స్థాయిలో సభకు జనాలు వచ్చే అవకాశం లేదని నిఘా వర్గాల రిపోర్ట్ తో కేసీఆర్ సభ రద్దు చేశారని పొలిటికల్ టాక్ లో నడుస్తున్న మరో వాదన. ఇలాగే గతంలో కూడా పరేడ్ గ్రౌండ్స్ లో రెండు సార్లు కేసీఆర్ సభలు రద్దు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2019 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఇలాగే రేపు సభ అనగా ఈ రోజున రద్దు చేశారు. 2020లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ జనసమీకరణ కష్టమనే కారణంతోనే రద్దు చేశారు. మొత్తానికైతే కేసీఆర్ కు పరేడ్ గ్రౌండ్స్ సభలకు పొత్తు కుదరడం లేదని అర్థమవుతోంది.