భారత్ సమాచార్, రాజకీయం : ఎన్నికల ముందు రాష్ట్ర జనాబాలో , ఓటర్లలో అత్యధికంగా ఉండే మహిళా ఓటర్లను ప్రత్యేకంగా ఆకట్టుకోటానికి ప్రతి రాజకీయ పార్టీ వ్యూహ-ప్రతి వ్యూహాలను సర్వే టీం ల సాయంతో రచిస్తోంది. అందులో భాగంగా వారి కోసం ప్రత్యేకంగా పథకాలను రూపొందిస్తున్నారు. తాజాగా టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీల కూటమి యువతుల కోసమే ప్రత్యేకంగా ‘కలలకు రెక్కలు’ అనే పథకాన్ని రూపొందించి ప్రకటించింది.
ఆడపిల్లల ఉన్నత విద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకికారాదన్న ఉద్దేశంతో కూటమి పార్టీలు కొత్తగా ‘కలలకు రెక్కలు’ పథకాన్ని తీసుకువచ్చినట్టు చంద్రబాబు నేడు తెలిపారు. ఇంటర్ విద్య పూర్తి చేసుకున్న అమ్మాయిలు ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటే, వారి విద్యా రుణాలకు ప్రభుత్వమే ష్యూరిటీ ఇచ్చే ప్రజా పథకం ఇది అని ప్రకటించారు. కోర్సు కాలానికి రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరించేలా దీన్ని రూపకల్పన చేశారని తెలిపారు. యువతుల అభిరుచులకు, ఆర్థిక అడ్డంకులు ఉండకూడదు అనే ఉద్దేశంతో దీన్ని రూపొందించినట్టు ఆయన వెల్లడించారు.