భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆటో డ్రైవర్ల జీవనోపాధికి భారీగా గండికొడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమ్యగోచరంగా మారింది. నిరుద్యోగులు, యువకులు, పేద, మధ్యతరగతి, బహుజన కులాల వారే ఎక్కువగా ఆటో డ్రైవర్లుగా తమ బతుకు బండిని నడిపిస్తుంటారు. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆటోలను ఎక్కేవారు లేక రోజుకు కనీసం రూ.500లను కూడా సంపాదించలేకపోతున్నామని వారు దీనంగా వాపోతున్నారు. వాస్తవానికి ఆటోలను ఎక్కువగా ప్రయాణించేంది మహిళలే. పురుషులు, యువకులు తమ బైక్ లపైనే ఎక్కువగా ప్రయాణిస్తారు. నూటికి 70 శాతం ఆటోల్లో మహిళలే ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్లకు గిట్టుబాటు కాక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని చాలా మంది ఆటో అన్నలు బాహాటంగా వాపోతూ, ఈ పథకం అమలు చేయోద్దని చాలా చోట్ల నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వాహన సంఘాలు ఈనెల 16న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపినిచ్చాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మోటార్ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు నిన్న రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ ను కలిసి సమ్మె నోటీసు కూడా ప్రభుత్వానికి అందించారు. బీఆర్ టీయూ, సీఐటీయూ, ఎఫ్ యూటీయూ, ఐఎఫ్ టీయూ తదితర సంఘాలన్నీ మద్దతు ఇచ్చినట్టు టీఏటీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య అధికారికంగా తెలిపారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ కు నెలకు రూ.15 వేలు జీవన వేతనం చెల్లించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని దూకుడుగా కొనసాగిస్తామని హెచ్చరించారు.