భారత్ సమాచార్.నెట్: లివర్ (Liver) మానవ శరీరంలో (Human Body) అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. మరియు జీవక్రియ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైనది. ఎంతో ముఖ్యమైన అవయవం(Organs). ఇది మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతోంది. ఇది శరీరంలో విష పదార్థాలను తొలగించడం, రక్తాన్ని ఫిల్టర్ చేయడం, పోషకాలను ప్రాసెస్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కాలేయ వ్యాధుల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏడాది ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని (World Liver Day) జరుపుకుంటారు. కాలేయ సంబంధిత వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. కాలేయ వ్యాధులను నివారించడానికి సహాయపడే జీవనశైలిని, ఆహారపు అలవాట్లను ఎంపిక చేసుకోవాలని ప్రజలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం.
ఈ ఏడాది కాలేయ దినోత్సవ థీమ్ ని ‘ఆహారమే ఔషధం’ గా నిర్ణయించారు. సమతుల్య ఆహరం, పోషకాల ప్రాముఖ్యత గురించి ఇది చెబుతుంది. ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, అలవాట్లు, పొడవైన కూర్చునే పద్దతులు, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో కాలేయ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఆల్కహాల్‌తో పాటు, చెడు ఆహారపు అలవాట్లు కాలేయ వ్యాధులకు అతిపెద్ద కారణం. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా అనేక వ్యాధులకు దారితీస్తాయి. అయితే, రోజువారీ జీవనశైలిలో కొన్ని చిన్నచిన్న మార్పులు చేసుకుంటే, మనం కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారు తప్పకుండా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఇప్పుడు చూద్దాం.
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆహారంలో ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను చేర్చాలి. ముఖ్యంగా ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లు, అల్లం, వెల్లుల్లి, పప్పులు, వాల్‌నట్స్, మఖానా, యాపిల్స్, బ్లూబెర్రీస్, బీట్‌రూట్, గ్రీన్ టీ వంటి వాటిని ఆహారంలో చేర్చడం వల్ల కాలేయానికి మేలు చేస్తుంది. ఇక మరోవైపు, వేయించిన పదార్థాలు, అధిక కొవ్వు పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను పూర్తిగా నివారించాలి. ఇకపోతే కాలేయం సమస్యను ఎలా గుర్తించాలంటే.. ఎల్లప్పుడూ అలసటగా అనిపించడం.. కాళ్ళు, కళ్ళు, చేతులు పసుపు వర్ణంలోకి మారడం.. కుడి వైపు ఉదర భాగంలో నొప్పి.. ముదురు రంగులో మూత్రం.. వికారం, వాంతులు.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోండి.