భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి జిల్లా: ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో గ్రామపంచాయతీ ఎన్నికల ఫేజ్–1 పోలింగ్ నిర్వహణకు సంబంధించి నియమితులైన రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్ఓ), పోలింగ్ ఆఫీసర్లు (పీవో)లకు నిర్వహిస్తున్న స్టేజి–2 శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, న్యాయంగా జరిగేలా అధికారులు పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలని సూచించారు. పోలింగ్ రోజు ఉదయం నుంచి ఓటింగ్ ముగిసే వరకు పాటించాల్సిన విధానాలు, ఈవీఎంల నిర్వహణ, బ్యాలెట్ పేపర్ వాడకం, పోలింగ్ సమయంలో ఎదురయ్యే సమస్యలకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు స్పష్టతనిచ్చారు. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, ఓటర్ల గుర్తింపు, రిగ్గింగ్ నివారణ, పోలింగ్ కేంద్రాల్లో శాంతి భద్రతల పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమంలో ప్రశ్నోత్తరాల ద్వారా అధికారులు తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కల్పించారు. పోలింగ్ విధుల్లో చిన్న తప్పిదం కూడా ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపుతుందని, అందువల్ల ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని వారికీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎన్నికల విభాగ అధికారులు, శిక్షణ పొందుతున్న ఆర్ఓలు, పీఓలు తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
7, డిసెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్