భారత్ సమాచార్.నెట్: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. ఈ నెల 15, 16 తేదీల్లో శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటనను విడుదల చేసింది. జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జులై 16న ఆణివార ఆస్థానం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా టీటీడీ తెలిపింది. ఈ రెండు ప్రత్యేక సందర్భాల సందర్భంగా ఆలయంలో విశేష ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో, వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేస్తున్నామని తెలిపింది.
అంతేకాకుండా 14, 15వ తేదీల్లో ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది టీటీడీ. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. మరోవైపు శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఇక స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు శ్రీవారి భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న భవనాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలసి అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీలో జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుని నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుత్తేదారులలో అలసత్వం లేకుండా ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.