భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, జులై 2025, ఆదివారంభారత్ సమాచార్

Toll Charges: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. టోల్ ఛార్జీలు తగ్గింపు!

1277964-toll-gate

భారత్ సమాచార్.నెట్: కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పింది. హైవే టోల్ ఛార్జీలను తగ్గించింది కేంద్రం. ఎన్‌హెచ్‌పై వంతెనలు, సొరంగాలు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ స్ట్రెచ్‌లు వంటి ప్రత్యేక నిర్మాణాలు ఉన్న రూట్లపై టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గించింది. ఇప్పటి వరకు 2008 నిబంధనల ప్రకారం వసూలు చేస్తున్న టోల్ ఛార్జీలను కేంద్రం తాజాగా సవరించింది. దీని వల్ల ప్రయాణదారులకు టోల్ ప్లాజాల వద్ద చెల్లించే రుసుము సగానికి తగ్గనుంది.

ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ జాతీయ రహదారుల రుసుము నియమాలను సవరించిన నిబంధనలు రెండు రోజుల క్రితమే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ అధికారికంగా ప్రకటించింది. జూన్ 2న విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, ఈ తగ్గింపులు అమల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు టోల్ ఫీజుల వసూలు పాత ప్రణాళిక ప్రకారం కొనసాగుతుండగా.. ఈ మార్పులతో వాహనదారులపై ఆర్థిక భారం కొంత మేరకు తగ్గనుంది.

ముఖ్యంగా వాణిజ్య వాహనాలకు పెద్ద ఊరట కలగనుంది. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రయాణ ఖర్చులను తగ్గించడంలో సహాయకరంగా నిలవనుంది. అదే సమయంలో మౌలిక సదుపాయల ఖర్చు రికవరీ, భరించగలిగే సామర్థ్యం మధ్య సమతుల్యతను కొనసాగిస్తుందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు చెబుతున్నారు. ఈ సంస్కరణతో కీలక రహదారుల విస్తరణలలో మొత్తం ప్రయాణ ఖర్చును తగ్గిస్తుందని, జాతీయ రహదారి నెట్ వర్క్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.