భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: జనవరి 1వ తేదీ నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఒక రోజు ముందుగానే పంపిణీ చేస్తోందని జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. డిసెంబర్ నెలలో కర్నూలు జిల్లాలో అర్హులైన 2,37,235 మంది లబ్ధిదారులకు రూ.104.23 కోట్లు పెన్షన్లుగా పంపిణీ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. బుధవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలం ఏ. గోకులపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లను అందజేశారు. అల్లా బి, పెద్ద శబాసిం సాహెబ్, తిరుపాలు లకు వృద్ధాప్య పెన్షన్, మహమ్మద్ రెహం, కైరున్ బిలకు వికలాంగుల పెన్షన్, కలాంకు అన్నకు అభయ హస్తం పెన్షన్, శ్రీనివాసులుకు కిడ్నీ వ్యాధిగ్రస్తుల పెన్షన్, వెంకటేష్‌కు పూర్తి స్థాయి వైకల్యం పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా పెన్షన్లు సరైన సమయంలో ఇంటి వద్దకే అందుతున్నాయా అని ప్రశ్నించగా, లబ్ధిదారులు ఇంటికే వచ్చి పెన్షన్ అందుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
1, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్