భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్: జిల్లాలో జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు – 2026 ఘనంగా ప్రారంభమయ్యాయి. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ డాక్టర్ శబరీష్‌తో కలిసి మాసోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ ఏడాది “సీక్ సే సురక్ష – టెక్నాలజీ సే పరివర్తన్” అనే నినాదంతో జనవరి 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారి నిబంధనలపై ప్రజల్లో చైతన్యం తేవడమే లక్ష్యంగా విద్యార్థులతో ర్యాలీలు, వ్యాసరచన పోటీలు, కంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ప్రాముఖ్యత, వేగ నియంత్రణపై విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.