భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నర్సాపూర్ పట్టణంలో ‘రాజన్న ఎంప్లాయ్మెంట్ సెల్’ ఆఫిషియల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేజీతోపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి, రాజన్న ఫౌండేషన్ ఛైర్మెన్ ఆవుల రాజిరెడ్డి అధికారికంగా ప్రారంభించారు. భారత్ ఉద్యోగ్ సంయుక్త సహకారంతో ప్రారంభమైన ఈ ఎంప్లాయ్మెంట్ సెంటర్ ద్వారా ఉద్యోగాల భర్తీ, కెరీర్ మార్గదర్శక సేవలు, వృత్తి నైపుణ్య శిక్షణ సేవలను పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌తో పాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో నేరుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టి, ఆయా మండల కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రైవేట్ రంగంలోని వివిధ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఐటీ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్తులో నర్సాపూర్ నియోజకవర్గంలో సాధ్యమైనంతవరకు నిరుద్యోగాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో, పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులకు వారి నైపుణ్యాలకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ సెల్ పనిచేస్తుందని తెలిపారు. స్థానిక యువత పార్టీలకు అతీతంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే మూడు సంవత్సరాల్లో 10,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యం నిరుద్యోగ యువత కోసం మునుపెన్నడూలేని విధంగా రాజన్న ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పలువురు విద్యావంతులు, యువత ప్రశంసలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా నర్సాపూర్ నియోజకవర్గంలోని నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దిశగా ఒక కీలక అడుగు పడిందని వారు పేర్కొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
4, జనవరి 2026, ఆదివారంభారత్ సమాచార్