భారత్ సమాచార్, హైదరాబాద్: దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు , మఠాలు , దేవస్థానాలు , ధార్మిక మండళ్లు, ట్రస్ట్‌లు, ధార్మిక పరిషత్‌లు ఉన్నాయి . అయితే వీటిలో 40 శాతం సంస్థలకు కోట్లాది రూపాయల నిధులున్నా ఆయా సంస్థలు పవిత్ర ధార్మిక ఆధ్యాత్మిక గ్రంథాల ప్రచురణ, విక్రయాలను వ్యాపారాత్మకంగా చేస్తున్నాయనేది మన ముందు కనిపిస్తున్న కఠిన సత్యం. కనీసంలో కనీసంగా కూడా ఉచితంగా దైవ గ్రంథాలను ఉచితంగా ఇవ్వరు గాక ఇవ్వరు. అవకాశం ఉన్నా కూడా 90శాతం ఇవ్వవు. కేవలం కరపత్రాలను లేదా బ్రోచెర్లను ఉచితంగా భక్తుల చేతుల్లో పెడతారు. అయితే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తన అమోఘమైన జ్ఞాన సంపదతో సమాజానికి మేలు చేసే ఒక మంత్ర పరిమళం లాంటి అక్షరచైతన్యం సుమారు ఇరవై ఏళ్లుగా చేస్తున్న నిస్వార్ధ ధార్మిక ఆధ్యాత్మిక సేవలు ఆదర్శనీయం.
అమిత్ షా చేతులమీదుగా ‘నేనున్నాను’ అఖండ గ్రంథం ఆవిష్కరణ:
దైవబలాన్ని మించిన మహాబలం సృష్టిలో లేదని గట్టిగా చెప్పే పురాణపండ శ్రీనివాస్ భారతదేశ చరిత్రలో తొలిసారిగా అతి అరుదైన ఐదువందల ఆంజనేయ స్వామివార్ల శిల్పాలతో , వర్ణ చిత్రాలతో , మంత్ర తంత్ర యంత్ర విశేషాలతో, పరమ రమణీయ వ్యాఖ్యానాలతో రూపొందించిన ‘నేనున్నాను’ అఖండ గ్రంథాన్ని భారతదేశ హోమ్‌శాఖామంత్రి అమిత్ షా ఆవిష్కరించడం విశేషం. మూడేళ్ల క్రితం నేనున్నాను అనే అఖండ గ్రంథాన్ని కేంద్ర హోమ్‌శాఖ మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని నేటికీ ఎంతోమంది సాహితీ ప్రముఖులు , ఆధ్యాత్మిక వేత్తలు పురాణపండ శ్రీనివాస్ సేవలను అభినందనీయమని పేర్కొంటారు. ఈ అఖండ గ్రంథాన్ని ఈగ వంటి సంచలనాత్మక చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నిర్మించి జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రచురించి ఇంచుమించుగా యావత్తు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దర్శక నిర్మాతలకు, ముఖ్య సాంకేతిక నిపుణులకు నాడు దీపావళి కానుకగా సమర్పించడం వారాహి చలన చిత్ర చరిత్రలో హైలైట్‌గానే పేర్కొనాలి. ఆ తరువాత మంత్రశక్తుల మహా కలశంగా రచించి సంకలనీకరించిన మరో అద్భుత ‘ మహామంత్రస్య ‘ ఐదువందల ఇరవై పేజీల గ్రంధాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించడం … తరువాత అమోఘ రచనా సంకలనాలుగా వెలువడిన ఏడు వందల పేజీల శ్రీపూర్ణిమ మంగళ గ్రంథాన్ని విఖ్యాత ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు ఆవిష్కరించి శ్రీనివాస్ ధైర్యం వెనుక అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా ఉందని చెప్పారు.
పురాణపండ శ్రీనివాస్ అధ్యాత్మిక సేవలు అభినందనీయం, ఆదర్శనీయం:
పురాణపండ శ్రీనివాస్ లేఖిని నుంచి జాలువారిన మరొక అపురూప వైదిక నిధుల 400 పేజీల గ్రంథం ‘ శ్రీమాలిక ‘ ఋషి వైభవం సృష్టిస్తున్న పవిత్ర సంచలనం ఇంతా అంతాకాదు. ఇప్పటికి ఇరవై ఐదు ఎడిషన్స్ అందించిదంటే ఎంతటి గొప్ప గ్రంథమో తెలుస్తోందని, యువతరం సైతం ఎక్కువ ఆసక్తి కనబరచడం మరొక విశేషంగానే పేర్కొనాలని హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో పాఠకులు అధికశాతం ముక్త కంఠంతో చాటిచెప్పారు. ఈ ఉత్సవంలో ప్రధానపాత్ర తీసుకున్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు , కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు సైతం అభినందించారు. పరమపవిత్రమైన మరొక ముఖ్యాంశమేంటే ఈ శ్రీమాలిక వైధిక గ్రంథాన్ని కాంచీపురం యతీంద్రులు , కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు ఆవిష్కరించి శ్రీనివాస్‌పై అనుగ్రహాన్ని వర్షించటం ఒక ముఖ్య ఘట్టంగా చెప్పవచ్చు. పురాణపండ శ్రీనివాస్ నిర్విరామ కృషికి దైవబలం ఎంతగా ఉందోనని ఆలయాల అర్చకులు, పండితులు సైతం చాటిచెప్పారు.
ఉచితంగా విష్ణుసహస్ర నామ స్తోత్రమ్:
పచ్చ కర్పూరపు పలుకుల్లాంటి చక్కని అందమైన ముందుమాటలతో అందించిన శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రమ్, శ్రీ రామరక్షాస్తోత్రమ్‌తో కూడిన పరమపవిత్రమైన శ్రీ విష్ణుసహస్ర నామ స్తోత్రమ్ నూట ఇరవై ఎనిమిది పేజీల మల్టీ కలర్ గ్రంథాన్ని హైదరాబాద్ చిక్కడపల్లిలోని చారిత్రాత్మక త్యాగరాయగానసభ శ్రీవైకుంఠ ఏకాదశి నుంచి వందల కొలది భక్తులకు ఉచితంగా పంచుతూనే ఉంది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మనకి ఉపయోగపడతాడంటేనే విజిటింగ్ కార్డు కూడా ఆలోచించి ఇస్తున్న ఈరోజుల్లో ఒక బుక్ కాదు ఎన్నో విలువైన గ్రంథాలను రచించి, ఏ స్వార్ధం లేకుండా సమాజ హితం కోసం ఉచితంగా ఇవ్వడం ఒక్క పురాణపండ శ్రీనివాస్‌కే చెల్లిందని, ఇది నిర్మాణాత్మకంగా కనిపిస్తోందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఒక పుస్తకావిష్కరణ సభలో అన్నమాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల విష్ణు భక్తులూ త్యాగరాయగానసభ కార్యాలయంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర దివ్య గ్రంథాన్ని ఈ ఉగాది పర్వదినం వరకూ ఉచితంగా పొందవచ్చని త్యాగరాయగానసభ కార్యవర్గం ప్రకటించింది.