భారత్ సమాచార్.నెట్, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. అయితే త్వరలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల కోసం ఇస్రో సేవలను ఉపయోగించుకోనుంది టీటీడీ ఇందు కోసం ప్రణాళికలను రూపొందిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భక్తులు ఎంత మంది వస్తారో తెలుసుకునేందుకు ఇస్రో సేవలను వినియోగించకోనున్నట్లు తెలుస్తోంది
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ నిర్వహించే సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా ఈ గరుడ వాహన సేవలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. అయితే వాహాన సేవల్లో పాల్గొనే భక్తుల కచ్చిత సంఖ్య తెలుసుకునేందుకు ఇస్రోను సాయం కోరింది. గరుడోత్సవం సందర్భంగా మాడవీధుల్లో ఎంత మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారనే దానిపై శాటిలైట్ల ద్వారా గుర్తించనుంది టీటీడీ.
ఈ విషయం గుర్తిస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేయొచ్చని టీటీడీ భావిస్తోంది. ఇక ఇప్పటికే బ్రహ్మోత్సవాల సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. బ్రహ్మోత్సవాల కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను నిర్దేశిత సమయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. విజిలెన్స్, పోలీసు విభాగాల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించింది.