భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ వడ్డే నాగేంద్ర అధ్యక్షతన భాస్కర్ రెడ్డి కాలనీలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఎస్పీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి మలిగే రామలింగయ్య మాట్లాడుతూ.. వడ్డే ఓబన్న స్ఫూర్తితో ప్రజలు తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. వడ్డే ఓబన్న స్వతంత్ర సమరయోధుడిగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి అని ఆయన గుర్తుచేశారు. ఆదోని ప్రాంతంలో రోడ్లు, త్రాగునీరు, వైద్య, విద్య వంటి మౌలిక సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రజలు ఓటు శక్తిని వినియోగించి సంఘటితంగా పోరాడాలని సూచించారు. ఆదోని జిల్లాగా ప్రకటించాలనే ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
11, జనవరి 2026, ఆదివారంభారత్ సమాచార్