భారత్ సమాచార్.నెట్: ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఓ ప్లాటు అమ్మిన విషయంలో రాజీవ్ కనకాలకు ఈ నోటీసులు ఇచ్చారు అధికారులు. అలాగే సినీ నిర్మాత విజయ్ చౌదరిపై కూడా హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలో విజయ్ చౌదరికి రాజీవ్ కనకాల ఫ్లాట్‌ను విక్రయించారు. ఈ క్రమంలోనే ఆయనపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 421లో ఉన్న రాజీవ్ కనకాలకు చెందిన ప్లాట్ నంబర్69ని విజయ్ చౌదరికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఆ ప్లాట్‌ను శ్రవణ్ రెడ్డి అనే వ్యక్తికి విజయ్ చౌదరి రూ. 70 లక్షలకు అమ్మేశారు. ఈ నేపథ్యంలోనే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నించగా.. అక్కడ ఫ్లాట్ లేదని తేలింది. దీంతో లేని ఫ్లాట్‌ను ఉన్నట్లు చూపి తనను మోసం చేశారని శ్రవణ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్లాటు విషయంపై నిలదీయగా.. దీనిపై వివాదం నడుస్తోందని.. ఏదైనా ఉంటే కూర్చోని మాట్లాడుకుందామంటూ సమాధానం ఇస్తున్నారని.. ఏడాది నుంచి ఈ విషయంపై సమాధానం దాటవేశారని.. అడిగితే అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో విజయ్ చౌదరి సహా రాజీవ్ కనకాలపై శ్రవణ్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే విచారణలో భాగంగా రాజీవ్ కనకాలకు నోటీసులు ఇచ్చారు.