భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, జనవరి 2026, శుక్రవారంభారత్ సమాచార్

ఆపరేషన్ స్మైల్‌తో బాలల భవిష్యత్తుకు భరోసా: అదనపు ఎస్పీ

WhatsApp Image 2026-01-22 at 6.13.02 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్: జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం చేపట్టిన “ఆపరేషన్ స్మైల్” విజయవంతంగా కొనసాగుతోందని అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ 20 రోజుల్లో 41 కేసులు నమోదు చేసి, 49 మంది బాలలను రక్షించినట్లు పేర్కొన్నారు. 12 మంది పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలించామని, నలుగురు బాలలను తిరిగి పాఠశాలల్లో చేర్పించామని వెల్లడించారు.

పిల్లల చేతిలో పనిముట్లు కాదు, పుస్తకాలు ఉండాలని.. బాల్యం బడిలోనే గడవాలని ఆయన పిలుపునిచ్చారు. హోటళ్లు, ఇటుక బట్టీలు, వ్యాపార సంస్థల్లో బాలలను పనిలో పెట్టుకుంటే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల కార్మికుల సమాచారం తెలిస్తే వెంటనే అధికారులకు తెలపాలని కోరారు. ఈ సమావేశంలో ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, సిడబ్ల్యూసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.