భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: ఉగ్రవాదాన్ని విడిచే వరకు పాక్‌కు సింధు జలాలు దక్కవని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. బుధవారం రాజ్యసభలో ఆయన ప్రసంగిస్తూ.. నీరు, రక్తం కలిసి ప్రవహించవని.. ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేసే వరకు సింధు జలాల ఒప్పందం పునరుద్ధరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో అధికారంలో ఉండి.. ఒప్పందం కుదుర్చుకున్న వారు భారత్ కంటే పాక్ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని పరోక్షంగా ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు.
మాజీ ప్రధాని నెహ్రూ ప్రభుత్వం చేసిన తప్పులను.. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం సరిదిద్దుతుందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ఇప్పుడు సింధూ జలాల ఒప్పందాన్ని సరిదిద్దుతున్నామని వెల్లడించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం వల్లే ఉగ్రవాదం గ్లోబల్ ఎజెండా అయిందని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితిలో భరత్‌కు సభ్యత్వం లేకపోయిన.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌పై ఆంక్షలు విధించేందుకు భద్రతా మండలి ఒప్పించగలిగమన్నారు.
ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్‌తో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించడం వెనుక ఎవరి ప్రమేయం లేదన్నారు. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ను నిలిపేయడం వెనుక కూడా ఎలాంటి వాణిజ్య కారణాలు కూడా లేవని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోను ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని.. పొరుగుదేశం పాక్ మళ్లీ తోక జాడిస్తే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.