భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు, మున్సిపల్ ఎన్నికల మూడవ రోజు నామినేషన్ ప్రక్రియ సందర్భంగా రామాయంపేట్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బందోబస్తును పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 75 వార్డులకు 150 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అందులో 21 సమస్యాత్మక ప్రాంగణాలను గుర్తించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 4 ఎస్ఎస్టీలు, 4 ఎఫ్ఎస్టీలు తనిఖీలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో సుమారు 500 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఎవరైనా ఎన్నికల సమయంలో కావాలని సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే, వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. అదేవిధంగా రామాయంపేటలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును కూడా పరిశీలించారు. డబ్బు, మద్యం, బహుమతుల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడం చట్టవిరుద్ధమని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
అక్రమంగా మద్యం విక్రయం, పంపిణీ చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు చెప్పడుతామని తెలిపారు. ఎన్నికల సమయంలో అధికారుల లిఖితపూర్వక అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, అలాగే మైక్ సెట్లు లేదా శబ్ద కాలుష్యం కలిగించే పరికరాలు వినియోగించరాదని స్పష్టం చేశారు. రూ.50,000 కంటే ఎక్కువ నగదు తరలించాలంటే తప్పనిసరిగా సరైన ఆధారాలు చూపించాలని, లేకపోతే నగదు సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే సందేశాలు, ద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రచారం చేస్తే సైబర్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్నవారు, గతంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీ షీటర్లను ముందుగానే గుర్తించి, సుమారు 1200 మందిపై ముందస్తుగా బైండోవర్ చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ వెంట రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, ఎస్ఐలు బాలరాజ్, రాజేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.