భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, జనవరి 2026, శనివారంభారత్ సమాచార్

ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణానికి టీజీ భరత్ కోటి విరాళం

a1da4e82-16f8-411a-97a1-c04b91b84f99

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కర్నూలు విమానాశ్రయం సమీపంలోని ఓర్వకల్లు వద్ద డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ.భరత్ శుక్రవారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డితో కలిసి యూనివర్సిటీ భవన పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణానికి తన వంతుగా రూ.1 కోటి విరాళం అందజేశానని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉర్దూ యూనివర్సిటీతో పాటు బీసీ భవన్, కాపు భవన్ వంటి ప్రజాప్రయోజన ప్రాజెక్టులు నిలిచిపోయాయని విమర్శించారు. మైనార్టీ ముస్లిం వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, సరైన విద్య ద్వారా విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని మంత్రి పేర్కొన్నారు. దావోస్ పర్యటనలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో విద్యా వ్యవస్థపై చర్చించామని, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొస్తున్నామని తెలిపారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ.. 2014–2019 కాలంలో ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసి మైనార్టీల విద్యాభివృద్ధికి బలమైన పునాది వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ నిర్మాణ పనులకు మళ్లీ ఊపు వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ నిధుల నుంచి రూ.1 కోటి మంజూరు చేయడం జరిగిందని, అందులో రూ.50 లక్షలతో రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. మంత్రి టీజీ భరత్ స్వంత నిధుల నుంచి రూ.1 కోటి ప్రకటించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ హయాంలోనే ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణ పనులు పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.