భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, మార్చి 2026, బుధవారంభారత్ సమాచార్

సంక్షేమ పథకాలు ప్రణాళికల రూపకల్పనలో జనగణన ఉపయోగపడుతుంది

uu

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అభివృద్ధి సంక్షేమ పథకాలు,మౌలిక వసతులు,ప్రణాళిక ల రూపకల్పన లో జనాభా గణన ఉపయోగ పడుతుందని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో చార్జి అధికారులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్వహిస్తున్న తొలి జనగణన అని, 2011 జనాభా గణన తర్వాత 2021 లో నిర్వహించ వలసిన ఈ ప్రక్రియ కోవిడ్ కారణంగా ఆలస్యంగా జనాభా గణన 2027 లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలలో జనాభా పరంగా,పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని, తెలిపారు.
జన గణన కార్యక్రమం రెండు దశల్లో నిర్వహించబడుతుందని తెలిపారు. మొదటి దశలో ఇళ్ల జాబితా (హౌస్‌లిస్టింగ్,హౌస్ ఎన్యూమరేషన్), గృహాల గణన, తెలంగాణ రాష్ట్రంలో ఈ దశ మే 11, 2026న ప్రారంభమై జూన్ 9, 2026 వరకు కొనసాగుతుందని, రెండవ దశలో జన గణన (పాపులేషన్ ఎన్యుమరేషన్) ప్రక్రియ ఫిబ్రవరి 2027లో నిర్వహించబడుతుందని, మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారని అన్నారు.
ఈ సంవత్సరం జరగనున్న జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారని, మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్‌లను ఉపయోగించి గణన ప్రక్రియను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రత్యేక పోర్టల్‌ను గణన ప్రారంభానికి సుమారు 15 రోజుల ముందు అంటే ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. మొదటి దశలో నిర్వహించబడే ఇళ్ల జాబితా మరియు గృహాల గణనలో ఇంటి నిర్మాణం (కచ్చా పక్కా,తదితర,) ఇంటి పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, త్రాగునీటి సౌకర్యం, మురుగునీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంటగది సౌకర్యం వంటి వివరాలతో పాటు రేడియో, టెలివిజన్, స్మార్ట్ ఫోన్ , కంప్యూటర్, సైకిల్, కారు వంటి గృహ సౌకర్యాలకు సంబంధించిన మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సేకరించే విధానాన్ని ఈ శిక్షణలో వివరించనున్నట్లు తెలిపారు. జనాభా లెక్కలు సేకరించడం ఒక ముఖ్యమైన బాధ్యతతో పాటు సవాలుతో కూడుకున్న పని అని పేర్కొన్నారు. అందుకు అధికారులు శిక్షణ లో తెలియచేసే ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవాలని,ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని తప్పకుండా గణనలో చేర్చాలని అధికారులకు ఆమె ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుండి ఉపాధి కోసం వచ్చిన వలస కూలీలను కూడా గణనలో చేర్చి వారి వివరాలను నమోదు చేయాలని సూచించారు.
ఫీల్డ్ స్థాయిలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ముందస్తుగా సిద్ధంగా ఉండాలని, పైస్థాయి అధికారులతో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తూ సమస్యలను పరిష్కరించుకుని జనగణనను విజయవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రెవెన్యూ గ్రామాలను, పట్టణాల్లోని వార్డులను సి.ఎం.ఎం.ఎస్ పోర్టల్ ద్వారా హౌస్ లిస్టింగ్, ఎన్యూమరేషన్ చేయడం ,స్వయంగా చేయడం శిక్షణ లో వివరించారు.జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.