భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ పట్టణం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడుతోంది. హాల్దీ పరివాహక ప్రాంతంలో స్వయంభువుగా వెలసిన శ్రీశ్రీశ్రీ సీతారాముల వారి దేవస్థానంలో మార్చి 25 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించబడనున్న శ్రీ సీతారాముల జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ మహోత్సవాల సందర్భంగా పట్టణమంతా భక్తి భావంతో నిండిపోగా, ఆలయ ప్రాంగణం పూలతోరణాలు, దీపాలతో అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.ఈ ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బొంది రజిని రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణ లగ్న పత్రికను పురోహితులు శ్రీ ఆత్రేయ శర్మ గారు శాస్త్రోక్తంగా రచించి, గ్రామస్తులు పనిబాటల వారి సమక్షంలో చదివి వినిపించారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్న ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు, హోమాలు, ఊరేగింపులు భక్తులను అలరిస్తాయి. ముఖ్యంగా మార్చి 27, శుక్రవారం నాడు నిర్వహించనున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ పవిత్ర వేడుకను దర్శించేందుకు పరిసర గ్రామాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తి, సంప్రదాయం, సామూహిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ శ్రీ సీతారాముల జాతర బ్రహ్మోత్సవాలు తూప్రాన్ పట్టణానికి ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకురానున్నాయి. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ సమత కాశిరెడ్డి, కౌన్సిలర్లు భైరం సత్యలింగం, చెలిమెల రాములు, జైపాల్ రాథోడ్, ఐలేష్ యాదవ్, పురోహితులు మనోహర్ పంతులు, గ్రామ పెద్దలు, పనిబాటల వారు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాల విజయవంతం కోసం తమ వంతు సహకారం అందించారు.