భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, ఏప్రిల్ 2026, మంగళవారంభారత్ సమాచార్

భూమి దక్కకపోతే ఆత్మహత్యే శరణ్యం: గిరిజనుల‌ ఆవేదన

WhatsApp Image 2026-04-20 at 7.03.48 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా:

“మా భూమి మాకు దక్కకపోతే మాకు ఆత్మహత్యే శరణ్యం.. ఐదుగురు అన్నదమ్ములం భూమిని నమ్ముకునే బతుకుతున్నాం.. కానీ ధనబలంతో ఓ ఎన్నారై మా పొట్ట కొడుతున్నాడు” అంటూ కౌడిపల్లి మండలం కుషన్ గడ్డ తండాకు చెందిన గిరిజన రైతులు ప్రజావాణిలో మొరపెట్టుకున్నారు. బాధితుల ఆవేదనను చూసి చలించిన జిల్లా యంత్రాంగం, తక్షణమే న్యాయం చేయాలని నిర్ణయించింది.

అదనపు కలెక్టర్ నాగేష్ స్పందన!
ప్రజావాణిలో బాధితులు ధరావత్ విఠల్, రాంచందర్, మిట్యా, నాను మరియు మాజీ సర్పంచ్ ధరావత్ మోహన్ సమర్పించిన వినతి పత్రంపై అదనపు కలెక్టర్ నగేష్ సానుకూలంగా స్పందించారు. గిరిజన రైతులకు అన్యాయం జరగనివ్వబోమని హామీ ఇస్తూ, వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

యుద్ధ ప్రాతిపదికన సర్వే:
మెదక్ జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) కిషన్ ఈ వ్యవహారంపై యుద్ధ ప్రాతిపదికన స్పందించారు. సర్వే నంబర్ 79/3లో తక్షణమే కొలతలు నిర్వహించాలని, ఇందుకోసం వెంటనే నోటీసులు జారీ చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. “గిరిజన అన్నదమ్ములకు న్యాయం చేయడమే మా ప్రాధాన్యత.. ఏ శక్తులూ సర్వేను అడ్డుకోలేవు” అని ఏడీ స్ప‌ష్టం చేశారు.

ఎన్నారై బెదిరింపులు – కౌడిపల్లి తాసిల్దార్ తీరు:
ఓ ఎన్నారై నుండి వస్తున్న ప్రాణహాని బెదిరింపులను, స్థానిక మండల అధికారుల జాప్యాన్ని బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో అధికారులు ఆదేశించినా కౌడిపల్లి తహసీల్దార్ కాలయాపన చేయడంపై జిల్లా యంత్రాంగం ఆరా తీస్తోంది.

గిరిజన బిడ్డల ఆశలు:
పట్టా పాస్ పుస్తకాలు, రైతుబంధు అందుతున్నా తమ భూమి కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్న ఈ ఐదుగురు సోదరులకు, తాజాగా ఉన్నతాధికారుల స్పందనతో కొత్త ఆశలు చిగురించాయి. త్వరలోనే సర్వే పూర్తి చేసి హద్దులు నిర్ణయించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని బాధితులు పేర్కొంటున్నారు.