భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, ఆగస్టు 2025, ఆదివారంభారత్ సమాచార్

వరద బీభత్సం.. భారీగా దెబ్బ‌తిన్న‌ పంటలు, రోడ్లు

01

భార‌త్ స‌మాచార్.నెట్, కామారెడ్డి: జిల్లాలో వరుసగా రెండు రోజుల పాటు కురిసిన అతి భారీ వర్షాలు, వరదలు తీవ్ర విలయాన్ని సృష్టించాయి. అకాల వర్షాలకు పంటలు, బ్రిడ్జిలు, రోడ్లు, చెరువుల కట్టలు ధ్వంసమై, జిల్లా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అధికారిక అంచనాల ప్రకారం.. జిల్లాలో 76,984 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, 54,223 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడం, కంకర, రాళ్లు చేరి మరింత నష్టం వాటిల్లింది. అత్యధికంగా వరి, మక్క, సోయా, పత్తి వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం
అలాగే, ఆర్అండ్‌బీ, పంచాయతీ రాజ్ శాఖలకు చెందిన 60కి పైగా రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి. రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో కొన్ని గ్రామాలకు మూడు రోజులుగా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. కామారెడ్డి-ఎల్లారెడ్డి మార్గంలో నాలుగు బ్రిడ్జిలు కొట్టుకుపోగా, లింగంపేట మండలం లింగంపల్లి వద్ద పాముల బ్రిడ్జి పూర్తిగా తెగిపోయింది. జిల్లా కేంద్రం నుంచి రాజంపేట మండల కేంద్రం మీదుగా మెదక్ జిల్లా వరకు ఉన్న రోడ్డు పలుచోట్ల ధ్వంసమైంది. లింగాయపల్లి సమీపంలో బ్రిడ్జి వద్ద రోడ్డు 100 మీటర్ల వరకు కొట్టుకుపోయింది.
తెగిపోయిన చెరువు క‌ట్టలు
జిల్లాలోని పలు మండలాల్లో చెరువుల కట్టలు తెగిపోయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లింగంపేట మండలంలో నాలుగు చెరువుల కట్టలు పూర్తిగా తెగిపోగా, పదుల సంఖ్యలో చెరువులకు బుంగలు ఏర్పడ్డాయి. వరద తీవ్రతకు పొల్కంపేట చౌదరి చెరువు కట్ట కొట్టుకుపోవడంతో, నీరు మొత్తం బయటకు వెళ్లిపోయింది. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలంలో మూడు చెరువులు, గాంధారి మండలంలో ఒక చెరువు కట్ట దెబ్బతింది. ఈ పరిణామాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

 

 

మ‌రిన్ని క‌థ‌నాలు

నిజాంసాగర్ కు భారీ వ‌ర‌ద‌.. 24 గేట్లు ఎత్తివేత‌