భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, సెప్టెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

కమీషన్ గొడవలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ‌ హత్య

05

భార‌త్ స‌మాచార్‌.నెట్, శ్రీసత్యసాయి: జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్రీకాంత్ (30) దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. బ్యాంకు రుణాలు ఇప్పించే విషయంలో చోటుచేసుకున్న కమీషన్ గొడవ ఈ హ‌త్య‌కు దారి తీసింది. ఎస్సై నరసింహుడు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీ సత్యసాయి జిల్లాలోని తలుపుల మండలానికి చెందిన అనిరుధ్ వివిధ బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేవాడు. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన రాజారాం శోభా అనే మహిళను అనిరుధ్‌కు పరిచయం చేశాడు. ఆమెకు ఇప్పించిన రుణంలో తనకు కూడా కమీషన్ కావాలని రాజారాం గ‌త‌ రాత్రి అనిరుధ్ ఇంటిపైకి వెళ్లి ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న అనిరుధ్, అతని తండ్రి శ్రీనివాసులు తలుపులకు తిరిగి వచ్చారు. అనిరుధ్ బావమరిది శ్రీకాంత్(30)తో కలిసి గ‌త‌ రాత్రి 12.30 గంటల సమయంలో రాజారాం ఇంటి వద్దకు వెళ్లారు. తనను చంపుతారన్న భయంతో రాజారాం ముందుస్తుగా ఏర్పాటు చేసుకున్న కత్తితో శ్రీకాంత్ తొడపై పొడవడంతో విపరీతమైన రక్తస్రావమైంది. కదిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతిచెందాడు. ఈ గొడవలో అనిరుధ్, అతని తండ్రి శ్రీనివాసులకు కూడా గాయాలయ్యాయి.

తలుపుల మండల పరిషత్ కార్యాలయంలో బోరు-పంపు మెకానిక్‌గా పనిచేస్తున్న కృష్ణయ్యకు శ్రీకాంత్ ఒక్కగానొక్క కుమారుడు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న శ్రీకాంత్ ఇటీవల పుట్టిన కుమారుడికి నామకరణం చేయాలని స్వగ్రామానికి వచ్చాడు. ఈ దుర్ఘటన అందరినీ కలచివేసింది. రాజారాం తండ్రి వెంకటరాయప్పతో పాటు తరుణ్‌ను అదుపులోకి తీసుకున్నామని, రాజారాం పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు.

 

 

మ‌రిన్ని క‌థ‌నాలు

పెళ్లయిన కొన్ని గంటల్లోనే నవవధువు బ‌ల‌వ‌న్మ‌ర‌ణం