భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: వనపర్తి పట్టణంలోని దాచే లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో ఎమ్మార్పీఎస్, వికలాంగుల హక్కుల పోరాట సమితి(VHPS), అనుబంధ సంఘాల విస్తృతస్థాయి సమావేశాన్ని కొమ్ము చెన్నకేశవులు మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్చార్జి టైగర్ జంగయ్య మాదిగ పాల్గొని మాట్లాడుతూ.. ఈ నెల మొత్తం తెలంగాణ రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా మహోద్యమంతో పెన్షన్ దారుల సత్తాను ప్రభుత్వానికి చాటి చెప్పుతామన్నారు. వికలాంగులు, చేయూత పెన్షన్ దారుల పెన్షన్ల పెంపు కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకునేందుకు ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధంకావాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. అందుకోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమ కార్యచరణను రూపొందించారన్నారు.
అన్నీ రహదారులను నిర్భంధిస్తాం.. నిరాహార దీక్షలు చేస్తాం:
MRPS, VHPS, చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి(CPHPS) ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ సెప్టెంబర్ 8న వేలాదిమంది వికలాంగులు, చేయూత పెన్షన్ దారులతో కలెక్టర్ కార్యాలయాల ముందు పెద్దఎత్తున మహాధర్నాను నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 12న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో పెద్దఎత్తున వేలాదిమంది వికలాంగులు, పెన్షన్ దారులతో ఎమ్మార్వో కార్యాలయాలను దిగ్బంధం చేస్తామన్నారు. సెప్టెంబర్ 20న హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని ఎల్బీనగర్ మొదలుకొని కోదాడ వరకు నేషనల్ హైవేని పెద్దఎత్తున దిగ్బంధం చేస్తామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 21నుంచి 26వరకు అన్ని గ్రామ పంచాయతీలలో నిరాహార దీక్షలు చేపడతామన్నారు. సెప్టెంబర్ 27న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల నుంచి హైదరాబాద్ కు వచ్చే అన్ని రహదారులను అలాగే గ్రామాల నుంచి జిల్లా కేంద్రాలకు వచ్చే అన్ని రహదారులను దిగ్బంధం చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులు, వృద్ధులు వితంతువులు మొదలగు అన్ని రకాల పెన్షన్లను పెంచాలన్నారు. లేదంటే రాష్ట్రప్రభుత్వంపై యుద్ధం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పీ.శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాజ శేఖర్, కుశ కుమార్, కొమ్ము చెన్నకేశవులు మాదిగ, గంధం గట్టయ్య మాదిగ, మీసాల నాగరాజు మాదిగ, తదితరులు పాల్గొన్నారు.