భారత్ సమాచార్.నెట్, మహబూబ్ నగర్: రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రానికి ఫైర్ స్టేషన్ అవసరమని, అందుకు సంబంధించిన డీపీఆర్ తయారు చేసి పంపించాలని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. గురువారం జడ్చర్ల పట్టణంలో కొత్తగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు ప్రభుత్వం అగ్నిమాపక శాఖకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మండలానికి ఒక ఫైర్ స్టేషన్ ఉంటే ప్రమాదాల తీవ్రత తగ్గుతుందన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారని, పాలమూరు-రంగారెడ్డి ముంపు బాధితులకు రూ.250 కోట్లు మంజూరు చేయించారని ప్రశంసించారు.
జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ప్రజల సేవకులుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఒకప్పుడు కరువుకు నిలయమైన పాలమూరు జిల్లాను ఇప్పుడు అభివృద్ధికి అంబాసిడర్‌గా మార్చుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన సెట్విన్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. సెట్విన్ సెంటర్ కోసం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రూ.20 లక్షలు తన సొంత డబ్బులు వెచ్చించి బిల్డింగ్‌ను సిద్ధం చేయించారని మంత్రి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. జడ్చర్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు
మహబూబ్‌నగర్‌లో జగదీశ్వర్ రెడ్డి విగ్రహావిష్కరణ