భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: గుమ్మడిదల మున్సిపల్ కార్యాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. అహింస, శాంతి, ధర్మ మార్గంలో నడిచిన వాసవి మాత ఆశయాలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శప్రాయమని కొనియాడారు. లోక కల్యాణం కోసం, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన త్యాగం చిరస్మరణీయమని, ప్రతి ఒక్కరూ ఆమె చూపిన మార్గంలో పయనించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కత్తుల రమేష్, శ్రీచూర్ణం చక్రపాణి, నాయకులు సారెడ్డి గారి వెంకట్రాంరెడ్డి, ఆకుల సత్యనారాయణ, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, హుస్సేన్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.