భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: మే 3వ తేదీన నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షను ఎలాంటి చిన్న తప్పిదాలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షకు సంబంధించి శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని ఒక పరీక్షా కేంద్రంలో మొత్తం 479 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 బి.ఎన్.ఎస్ సెక్షన్ అమలులో ఉంటుందని, పటిష్ట పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం వంటి అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
అభ్యర్థుల కోసం కలెక్టర్ ప్రత్యేక సూచనలు జారీ చేశారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి 5:20 గంటల వరకు జరుగుతుందని, అభ్యర్థులను ఉదయం 11 గంటల నుండే కేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించబోరని స్పష్టం చేశారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఫోటో ఐడి ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో వెంట తీసుకురావాలని, షూస్ ధరించకుండా సాధారణ చెప్పులతో రావాలని సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, లోహ ఆభరణాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని ఆమె పేర్కొన్నారు.