భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

3, మే 2026, ఆదివారంభారత్ సమాచార్

రెవెన్యూ కార్యాలయంలో నేలపై పడుకుని వినూత్న నిరసన

WhatsApp Image 2026-05-02 at 1.57.23 PM

భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట తహశీల్దార్ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ భూమిని అక్రమంగా పట్టా మార్చుకున్నారని ఆరోపిస్తూ శివంపేట మండలం భీక్యా తండాకు చెందిన ఓ రైతు కుటుంబం తహశీల్దార్ కార్యాలయం మెయిన్ ఎంట్రన్స్ వద్ద నేలపై పడుకుని వినూత్న నిరసన చేపట్టింది. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు కార్యాలయం వదిలి వెళ్లేది లేదని బాధితులు భీష్మించుకు కూర్చొన్నారు. బాధితుల కథనం ప్రకారం.. భీక్యా తండాకు చెందిన రైతు భద్రియా 2020లో మృతి చెందారు. ఆయన పేరు మీద సర్వే నెంబర్ 315/37/2లో 2 ఎకరాల 38 గుంటల భూమి ఉంది. అయితే, ఈ భూమిని అప్పటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హనుమంతరావు అక్రమంగా తన పేరుపై పట్టా చేయించుకున్నారని బాధితులు ఆరోపించారు. దీనికి అప్పటి రెవెన్యూ అధికారులు కూడా సహకరించి, రికార్డుల నుంచి తమ తండ్రి పేరును తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూమిని ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి విక్రయించి సొమ్ము చేసుకున్నారని భద్రియా కుమారులు తెలిపారు.

తమకు వారసత్వంగా రావాల్సిన భూమి కోసం గత కొన్నేళ్లుగా తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని భద్రియా కుమారులు మునిరామ్, చందర్, బాల్ సింగ్, లక్ష్మణ్, శివాలాల్ కన్నీరుమున్నీరయ్యారు. అధికారుల నిర్లక్ష్యం, అక్రమాలకు పాల్పడిన వారి ప్రలోభాల వల్లే తమకు అన్యాయం జరిగిందని వారు వాపోయారు. “మా భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మా సాగు భూమిని మాకు తిరిగి ఇప్పించాలి. లేదంటే మా కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యం” అని వారు హెచ్చరించారు. బాధితుల ఆవేదన చూసి స్థానికులు, తోటి రైతులు చలించిపోయారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతు కుటుంబం వేడుకుంటోంది.