భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, మే 2026, సోమవారంభారత్ సమాచార్

విద్యా నిలయమా.. వ్యసనాల అడ్డానా?

WhatsApp Image 2026-05-03 at 6.18.31 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రస్తుతం దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు విద్యా కుసుమాలతో కళకళలాడిన ఈ పాఠశాల, నేడు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. పాఠశాల ఆవరణలో ఎక్కడ చూసినా మద్యం సీసాలు, గంజాయి ప్యాకెట్లు, సిగరెట్ ముక్కలు దర్శనమిస్తుండటం విద్యా వ్యవస్థ వైఫల్యానికి అద్దం పడుతోంది. మందుబాబుల ఆగడాల వల్ల విద్యార్థులు సైతం పెడదారి పడుతున్నారని, యుక్త వయసులోనే మద్యం సేవిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాలలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. సరైన గేటు లేకపోవడంతో ఆవరణ అసాంఘిక శక్తులకు వరంగా మారింది. భవనాల పైకప్పులు ప్రమాదకరంగా వేలాడుతుండగా, తరగతి గదుల్లో కూర్చోవడానికి కనీసం కుర్చీలు కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా బాలికలు టాయిలెట్ సౌకర్యం లేక అర కిలోమీటరు దూరం వెళ్లాల్సి వస్తోంది. ఆట స్థలం సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. 15 ఏళ్ల క్రితం 650 మందికి పైగా ఉన్న విద్యార్థుల సంఖ్య, ఈ దుస్థితి కారణంగా నేడు 200 లోపుకు పడిపోయింది. ఇప్పటికైనా పోలీస్, విద్యాశాఖ అధికారులు స్పందించి, పాఠశాలను బాగుచేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.