భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్: నెల్లికుదురు మండలం నర్సింహులగూడెంలోని శ్రీ కోరగుట్ట లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు కన్నులపండువగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి గిరి చుట్టూ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ‘బండ్లు ప్రదక్షిణ’ కార్యక్రమం ఘనంగా జరిగింది.
భక్తులు తమ ఎడ్లబండ్లతో పాటు ద్విచక్ర, త్రిచక్ర, చతుశ్చక్ర వాహనాలను పూలతో అందంగా అలంకరించుకుని, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి గిరి ప్రదక్షిణ చేశారు. శనివారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు సోమవారం నాటి బండ్లు ప్రదక్షిణ, ప్రసాద వితరణతో పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
స్థానిక ఎస్సై చిర్ర రమేష్ బాబు తన సిబ్బందితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్సై ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు.