భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: చేగుంటలోని దీప్తి విద్యాలయం హై స్కూల్లో వేసవి ఉచిత శిక్షణ శిబిరంలో భాగంగా ఫెన్సింగ్ శిక్షణ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ శిక్షణను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోచ్ కరణం గణేష్ రవికుమార్ కోరారు. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన ఈ శిబిరం జూన్ 7వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన వివరించారు. 6 నుంచి 14 ఏళ్ల లోపు వయస్సు గల బాలబాలికలు ఎవరైనా ఈ శిక్షణలో పాల్గొనవచ్చని, ప్రతిరోజూ సాయంత్రం 4:30 నుంచి 7 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సుమారు 50 మంది క్రీడాకారులు ఈ శిబిరంలో శిక్షణ పొందుతున్నారని వెల్లడించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఫెన్సింగ్ క్రీడకు సంబంధించి శిక్షణ కేవలం చేగుంటలో మాత్రమే అందుబాటులో ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేసి, పతకాలు సాధించేలా తీర్చిదిద్దుతామని గణేష్ రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక విద్యార్థులు ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకుని మంచి క్రీడాకారులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు సంతోష్, నిశాంత్ తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
10, మే 2026, ఆదివారంభారత్ సమాచార్