భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి, శివంపేట మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గత వారం పది రోజులుగా కల్లాల వద్ద పెద్ద ఎత్తున ధాన్యం పేరుకుపోయిందని, కొనుగోలు సాగడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. శివంపేట మండలంలోని చిన్న గొట్టిముక్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు. కౌడిపల్లి మండల కేంద్రంలో కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించగా ఆందోళనకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులతో పాటు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు.
అకాల వర్షాలు కురిసి ధాన్యం తడిసిపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హెచ్చరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధాన్యం పేరుకుపోయిందని, ఎక్కడా కూడా కొనుగోలు సరిగా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.