భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, మే 2026, ఆదివారంభారత్ సమాచార్

నర్సాపూర్‌లో కోతుల బీభత్సం:యువకుడికి తీవ్ర గాయాలు

WhatsApp Image 2026-05-16 at 7.18.27 PM

భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కోతుల బెడద రోజురోజుకూ మితిమీరిపోతోంది. తాజాగా కోతుల గుంపు చేసిన దాడిలో ఒక యువకుడు భవనం పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నర్సాపూర్‌కు చెందిన గణేష్ అనే యువకుడు తన ఇంటిపై కూర్చుని ఉన్న సమయంలో, ఒక్కసారిగా కోతుల గుంపు అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఆకస్మికంగా జరిగిన ఈ దాడి నుంచి తప్పించుకునే క్రమంలో గణేష్ అదుపుతప్పి భవనం పైనుంచి కిందపడిపోయాడు.

ఈ ప్రమాదంలో గణేష్‌కు బలమైన గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని పెద్ద ఆసుపత్రికి తరలించినట్లు బాధితుడి బంధువులు తెలిపారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, కోతుల బెడదతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి, పట్టణంలో కోతులను కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.