భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, మే 2026, మంగళవారంభారత్ సమాచార్

అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం కుప్పలు

WhatsApp Image 2026-05-25 at 8.51.32 PM

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి గ్రామంలో సోమవారం కురిసిన భారీ అకాల వర్షం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద రోడ్లపై నిల్వ ఉంచిన వరి ధాన్యం కుప్పలు పూర్తిగా వర్షం నీటిలో తడిసి ముద్దయ్యాయి. కొనుగోలు కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్న రైతులకు ఈ వర్షం మరింత కష్టాలను తెచ్చిపెట్టింది. గ్రామంలోని ఐకేపీ సెంటర్‌లో సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో వర్షపు నీరు నేరుగా ధాన్యం కుప్పలలోకి చేరింది. దీంతో ఇప్పటికే అప్పులు, పెట్టుబడుల భారంతో ఉన్న రైతన్నకు మరో దెబ్బ తగిలినట్లైంది. ధాన్యం ఎప్పుడు కొంటారు..? మా కష్టానికి ధర దక్కుతుందా..? అన్న ఆందోళన రైతుల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. గత కొన్ని రోజులుగా అధికారులు లారీలు అందుబాటులో లేవు.. హమాలీలు లేరనే కారణాలతో ధాన్యం తరలింపును జాప్యం చేస్తున్నారు.

ఇదే సమయంలో వాతావరణ శాఖ అకాల వర్షాలపై హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని రైతులు మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తార్పులు, షెడ్లు, నీటి పారుదల వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో వర్షం పడిన ప్రతీసారి రైతులే నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు తిరస్కరించే ప్రమాదం ఉండటంతో రైతుల్లో మరింత భయం నెలకొంది. ఒకవైపు పెట్టుబడులు, మరోవైపు ప్రకృతి విపత్తులు.. ఇక అధికారుల నిర్లక్ష్యం రైతన్నను దిక్కుతోచని స్థితికి నెట్టేస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి నాగులపల్లి ఐకేపీ కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యాన్ని అత్యవసరంగా కొనుగోలు చేసి రైతులకు నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తడిసిన ధాన్యానికి ప్రత్యేకంగా మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.