భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: యువత చదువుతో పాటు క్రీడల వైపు కూడా సమానంగా మొగ్గు చూపాలని స్థానిక పెద్దలు పిలుపునిచ్చారు. చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ (పీపీఎల్) సీజన్ (2) క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. పోలంపల్లి గ్రామానికి చెందిన యువత చదువుతో పాటు, వ్యవసాయం, క్రీడారంగాల్లో ముందుండటం ఎంతో అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. గత జనవరిలో పీపీఎల్ సీజన్-1 విజయవంతం కాగా, ప్రస్తుతం సీజన్-2 మ్యాచ్లను మొత్తం 4 జట్లతో నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో కృష్ణా రాయల్స్ (కెప్టెన్ సీహెచ్ కృష్ణ-16 మంది సభ్యులు), చందు వారియర్స్ (కెప్టెన్ చందు-16 మంది సభ్యులు), గణేష్ టైగర్స్ (కెప్టెన్ గణేష్, వైస్ కెప్టెన్ టి. భాస్కర్-17 మంది సభ్యులు), ఆర్పీ కింగ్స్ (కెప్టెన్ ప్రశాంత్, వైస్ కెప్టెన్ కె. రాజు-16 మంది సభ్యులు) జట్లు తలపడుతున్నాయి.
ఈ క్రీడా పోటీల నిర్వహణకు, క్రీడా ప్రాంగణ ఏర్పాటుకు సహకరించిన గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులకు, వివిధ యూత్ అధ్యక్షులకు, గ్రామ పెద్దలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మైదానాన్ని సిద్ధం చేయడంలో సహకరించిన మరబోయిన ఐలయ్య, పర్వతాలు, శ్రీనులకు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామంలో జరుగుతున్న ఈ క్రికెట్ సీజన్ (2) పోటీలను క్రీడాభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని స్థానిక యువత కోరింది.