భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని వెల్దుర్తి నూతన తహశీల్దార్ విజయలక్ష్మి తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వెల్దుర్తి తహశీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవలే తహశీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. మండలంలోని ప్రజలు రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని, మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేలా చర్యలు చేపడతామని చెప్పారు. రైతులు తమ పంటలను విక్రయించడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఉద్యోగి తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, కార్యాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.