భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, జూన్ 2026, గురువారంభారత్ సమాచార్

మెదక్ జిల్లాలో 85 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి..

WhatsApp Image 2026-06-03 at 7.21.40 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ : జిల్లాలో ప్రస్తుత సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా సాగుతూ ముగింపు దశకు చేరుకుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 85 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటికే 180 కొనుగోలు కేంద్రాలను విజయవంతంగా మూసివేసినట్లు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. మిగిలిన కేంద్రాలలో కూడా మరో వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తిగా ముగించి, అన్ని కేంద్రాలను మూసివేస్తామని స్పష్టం చేశారు.

రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తూ క్రియాశీల పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతిరోజూ నిర్వహించే సమీక్షా సమావేశాలలో ధాన్యం కొనుగోళ్లు, రవాణా, మిల్లులకు తరలింపు, క్షేత్రస్థాయి సమస్యలపై ఆరా తీస్తూ ఎక్కడికక్కడ తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తున్నారు.

జిల్లాలో ఇప్పటివరకు 69,685 మంది రైతుల వద్ద నుంచి 3,40,078.200 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సజావుగా కొనుగోలు చేసినట్లు కలెక్టర్ వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటవెంటనే ఓపీఎంఎస్ (OPMS) పోర్టల్‌లో నమోదు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే 55,590 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 597.09 కోట్లను నేరుగా జమ చేయడం జరిగిందన్నారు.

ధాన్యం బస్తాలు కేంద్రాల్లో ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా వెంటనే రైస్ మిల్లులు, గోదాములకు తరలించేందుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం జిల్లాలో ప్రస్తుతం 600 లారీలు, 50 డీసీఎంలు, 300 ట్రాక్టర్లను అందుబాటులో ఉంచామన్నారు. గోదాములు, రైస్ మిల్లుల వద్ద అన్‌లోడింగ్ పెండింగ్ లేకుండా ఉండేందుకు, మిల్లులకు వచ్చే ధాన్యాన్ని మరింత మంది హమాలీలను పెట్టుకొని త్వరగా దిగుమతి చేసుకునేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రతి మిల్లు, కేంద్రం వారీగా రవాణా, నిల్వ, లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియల్లో ఎటువంటి ఆలస్యం లేకుండా సివిల్ సప్లైస్, రవాణా, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో అలర్ట్‌గా ఉంటూ పనిచేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు.