భారత్ సమాచార్.నెట్, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పుల్లారెడ్డి చెరువును తక్షణమే పునరుద్ధరించాలని, గతంలో విడుదలైన నిధుల దుర్వినియోగంపై న్యాయవిచారణ చేపట్టాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక డిమాండ్ చేశారు. పట్టణ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పాదయాత్రలో భాగంగా శుక్రవారం నాయకులు కొత్తగూడ బజార్లోని పుల్లారెడ్డి చెరువును పరిశీలించారు.
ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ.. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో ఉన్న చెరువు, నేడు 12 అడుగుల పూడిక, గుర్రపుడెక్క, విష వ్యర్థాలతో కాలుష్య కాసారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ కింద నిధులు మంజూరైనప్పటికీ పనులు జరగలేదని, దీనిపై నిజనిర్ధారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు పూడిక తీసి, వ్యర్థాల శుద్ధికి రీసైక్లింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని, పరిసర ప్రభుత్వ భూముల్లో పార్కులు నిర్మించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రజాసంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఎర్ర అఖిల్ కుమార్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పేర్ల నాగయ్య, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ, జిల్లా సహాయ కార్యదర్శి ఒంటికొమ్ము సంతోషి మాత, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు భీమనపల్లి ప్రకాష్, గుండాల శివ తదితరులు పాల్గొన్నారు.