భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: తూప్రాన్ పరిసర ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ ఇక్కడ నూతన కోర్టు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ప్రతిపాదిత కోర్టు భవనంగా గుర్తించిన పాత ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ, అదనపు జిల్లా న్యాయమూర్తి సంతోష్ కుమార్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మౌలిక వసతులు, మరమ్మతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 30 లక్షలు మంజూరు చేసింది. జులై 31వ తేదీలోపు అన్ని పనులు పూర్తి చేసి భవనాన్ని అప్పగించాలని జిల్లా న్యాయమూర్తి కాంట్రాక్టర్ను ఆదేశించారు.
ఆగస్టులో ఈ కోర్టు ప్రారంభం కానుందని న్యాయశాఖ వర్గాలు తెలిపాయి. అంతకుముందు, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా న్యాయమూర్తులు కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఎస్పీ నరేందర్ గౌడ్, ఎంపీడీవో సతీష్, తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి, న్యాయవాదులు బొడ్డు శ్రీనివాస్, ఎం. అశోక్, వేణుగోపాల్ చారి, శివకుమార్, శ్రీపతిరావు, అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీసు, న్యాయశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.