భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జి కంఠరెడ్డి తిరుపతి రెడ్డి 58వ జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మెదక్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం వరకు శ్రేణులు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న తిరుపతి రెడ్డి.. ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ ల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కంఠరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాలుగా ఎలాంటి పదవులు లేకపోయినా నిరంతరం ప్రజాసేవలోనే ఉన్నానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆశీస్సులతో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసే వరకు మెదక్ నియోజకవర్గాన్ని విడిచిపెట్టనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.