భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం దుర్గా భవాని తండా జీపీ పరిధిలోని రామోజీ తండా, పీన్యా తండా గిరిజనుల మధ్య శనివారం దారి విషయంలో గొడవ జరిగింది. రామోజీ తండా వాసులు తమ చెలుకల వద్దకు ఉన్న దారికి పీన్య తండావాసులు జీసీబీ యంత్రంతో రాళ్లు పెట్టారు. దీంతో రామోజీ తండా వాసులు పూర్వం నుంచి ఉన్న దారికి ఎందుకు రాళ్లు పెడుతున్నారని వద్దని చెప్పినప్పటికీ వినకుండా పెద్ద పెద్ద రాళ్లను అడ్డుగా పెట్టారు. స్థానిక సర్పంచ్ భూక్య వీరన్న నాయక్తో పాటు తండావాసులు మాట్లాడుతూ పీన్యా తండా నుంచి రామోజీ తండాను కలుపుకొని తుమ్మలకుంట చెరువు వద్దకు ఒక కిలోమీటర్ పైగా చెరువు, సాగు భూముల వద్దకు వెళ్లడానికి పూర్వం నుంచే దారి ఉందన్నారు. సంబంధిత మట్టి రోడ్డు నుంచి రామోజీ తండాకు చెందిన గిరిజనులు వెళ్లవద్దని, ఈ బాట తమ సొంతమని పీన్యతండకు చెందిన గుగులోతు మంగీలాల్, ఉపేందర్, రవీందర్, రామ్ ధన్, ఖీమా, జగన్ తమపైకి దౌర్జన్యంగా గొడవకు దిగి నెట్టివేశారని సర్పంచ్ వీరన్న నాయక్ చెప్పారు.
రామోజీ తండా నుంచి గల సీసీ రోడ్డు, మట్టి రోడ్డు జాయింట్ వద్ద దారి లేకుండా రాళ్లు పెట్టడంతో పోలీసులకు సమాచారం ఇచ్చామని సర్పంచ్ తెలిపారు. ఈ దారికి అడ్డుగా రాళ్లు పెట్టడంతో రైతులు తమ వ్యవసాయ భూముల వద్దకు వెళ్లే పరిస్థితి లేకుండా పోతుందని, వెంటనే దారికి అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఎంత చెప్పినా వినకుండా జీసీబీ డ్రైవర్ పీన్యా తండావాసుల వైపు దౌర్జన్యంతో రాళ్లను దూరం నుంచి తీసుకువచ్చి పెట్టాడని ఆరోపించారు. కాగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దారికి అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించాలని పీన్యా తాండవాసులకు చెప్పినప్పటికీ వారు వినలేదు. ఈ కార్యక్రమంలో గుగులోతు దేవోజి, గుగులోతు లాలు, దూమ్లా, హరి సింగ్, భూక్యగన్య, భూక్య సర్వన్, భిక్షం, బానోతు కౌసల్య, మంగమ్మ, శ్రీదేవి, తదితర తండావాసులు పాల్గొన్నారు.