భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల ఎంపీడీవో కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ జడల నవీన్ తొర్రూరు నర్సంపేట ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. తొర్రూరు నుంచి తన స్వగ్రామం గుర్తూరుకు బైక్పై వెళ్తున్న క్రమంలో ఈ విషాద ఘటన జరిగింది. నవీన్ గత కొన్ని సంవత్సరాలుగా నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయనకు భా,ర్య ఇద్దరు సంతానం ఉన్నారు. కంప్యూటర్ ఉద్యోగిగా మండల ప్రజలకు సుదీర్ఘకాలంగా ఉత్తమ సేవలు అందించేవాడని మంచి పేరుంది. నవీన్ ఆకస్మిక మృతితో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన నవీన్ అకాల మృతితో ఆయన కుటుంబం పెద్దదిక్కును కోల్పోయి పిల్లలు భార్య అనాధలయ్యారని ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ఎంపీడీవో కుమార్ ఘన నివాళి..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నవీన్ పార్థివ దేహాన్ని నెల్లికుదురు ఎంపీడీవో సింగారపు కుమార్ సందర్శించి ఘన నివాళులర్పించారు. పోస్టుమార్టం సంబంధించిన తదితర పనులను ఎంపీడీవో దగ్గరుండి స్వయంగా పర్యవేక్షిస్తూ జరిపించారు. మృతుని స్వగ్రామం గుర్తూరుకు భౌతికకాయాన్ని గ్రామస్తులతో కలిసి తీసుకువెళ్లారు. ఎంపీడీవో వెంట కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.