భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, జూన్ 2026, గురువారంభారత్ సమాచార్

చిన్ననాగారం ముత్యాలమ్మ తల్లికి ఘనంగా బోనాలు

WhatsApp Image 2026-06-17 at 6.36.52 PM

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామస్తులు ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలోని కోరిన కోరికలు తీర్చే మహిమాన్విత శ్రీ ముత్యాలమ్మ తల్లికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా బుధవారం బోనాలు చేశారు. ఎడ్లబండ్లు, ఆటోలు, ట్రాక్టర్లు, కార్లలో భక్తులు తరలివచ్చి దేవస్థానం చుట్టూ కుటుంబాల సమేతంగా ప్రదక్షిణలు చేశారు. అమ్మవారికి పట్నాలు వేసి అనంతరం శివ శక్తుల పూనకాల జోరు, డప్పు చప్పుళ్ల హోరులో మహిళలు సామూహికంగా బోనాలను ఎత్తుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి లోకపావనులైన శ్రీ ముత్యాలమ్మ, మారమ్మ, పెద్దమ్మ, లోతుగుంట మైసమ్మ తల్లులకు బోన నైవేద్యాలను సమర్పించారు.

కోళ్లు, పొట్టేళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు కురిసి పాడిపంటలతో గ్రామాలు కళకళ లాడుతూ అష్ట, ఐశ్వర్య, ఆయురారోగ్యాలతో ఉండాలని జగజ్జననిలను వేడుకున్నారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ తల్లి భక్తులు కారోబారు దూబర్ల సాయిలు, గొడుగు వెంకన్న,పెద్ద బోయిన వెంకన్న,దొడ్ల తిరుపతి, నక్క హరీష్,వరుణ్,రవికుమార్ తదితరులు మాట్లాడుతూ ఏటా ముత్యాలమ్మ తల్లికి వర్షాకాలం ముందు బోనాల జాతర నిర్వహిస్తామని, ఈ క్రమంలో అమ్మవారికి బోనాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.