భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండలం వెలుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ధర్మారపు వెంకన్న తన ఇద్దరు పిల్లలను చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు అద్భుతంగా ఉన్నాయని, ప్రైవేట్ సంస్థలను మించిన నాణ్యమైన విద్య ఇక్కడ అందుతుందని కొనియాడారు. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు పెట్టే అనవసర ఖర్చును పిల్లల ఉన్నత చదువుల కోసం దాచుకుంటే బాగుంటుందని ఎంఈఓ బోయిని లింగయ్య సూచించారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఉపాధ్యాయుడినయ్యానని, అందుకే నమ్మకంతో తన పిల్లలను ఇక్కడే చేర్పించానని టీచర్ వెంకన్న తెలిపారు. వెలుగుపల్లిలోని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని తుంగతుర్తి ప్యాక్స్ చైర్మన్, డీసీఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గొడుగు అబ్బయ్య, పీఆర్టీయూ మండల కార్యదర్శి చిత్తలూరి శ్రీరాములు, గ్రామ సర్పంచ్ సోలిపురం అశ్వినీ లక్ష్మారెడ్డి, వార్డు సభ్యులు మామిడి రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
24, జూన్ 2026, బుధవారంభారత్ సమాచార్