భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: తెలంగాణలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రరమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆలయ వైదిక బృందం మంత్రిచే ఆలయంలో ప్రత్యేక కుంకుమార్చన తదితర పూజలు చేయించారు. అనంతరం ఆలయ వైదిక బృందం మంత్రికి ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇటీవల చోరీ జరిగిన మహాకాళి అమ్మవారి ఆలయాన్ని మంత్రి సందర్శించి ఘటనపై ఆరా తీశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందితో ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకు ముందు శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు, టెండర్ల ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల, ఆలయ ఈవో అంజనాదేవితో మంత్రి సమీక్ష నిర్వహించారు. టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. చదువుల తల్లి సరస్వతి అమ్మవారు ఆలోచన విధానాలను మారుస్తుందని, సరైన ఆలోచనలు లేకపోవడంతోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్త పరచారు.ఇప్పటికే 300 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశాం. బాసర దేవాలయం యాదగిరిగుట్ట తరహా అభివృద్ధి చేస్తామని అన్నారు. దేవాలయ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అతి త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.