భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

3, జులై 2026, శుక్రవారంభారత్ సమాచార్

యువతి చేతిలో పుస్తకం.. టైటిల్ చూసి నెటిజన్లు షాక్!

17

భారత్ సమాచార్: సాధారణంగా ప్రయాణాల సమయంలో పుస్తకాలు చదవడం చాలామందికి అలవాటు. అయితే, ఇటీవల మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ యువతి చదువుతున్న పుస్తకం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. ఆమె చేతిలో ఉన్న ‘How to Kill Men and Get Away With It’ అనే పుస్తకం టైటిల్ చూసి తోటి ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది మిలియన్ల వ్యూస్‌, లక్షల లైక్స్ సాధించి వైరల్‌గా మారింది. ఇటీవలి కాలంలో మహిళలు, కుటుంబ హత్యలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో మరింత చర్చనీయాంశమైంది.

పుస్తకం శీర్షిక చూసిన కొందరు ఇది నేరాలకు సంబంధించిన మార్గదర్శక పుస్తకమేమోనని భావించి కామెంట్లు చేయగా, మరికొందరు సరదాగా స్పందించారు. ఇంకొందరు మాత్రం సమాజంలో జరుగుతున్న నేరాలతో దీనిని పోల్చి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పుస్తకం టైటిల్‌ను మాత్రమే చూసి దాని విషయాన్ని అంచనా వేయడం సరైంది కాదని సాహిత్యాభిమానులు అభిప్రాయపడుతున్నారు. బోల్డ్ టైటిల్ కారణంగానే ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా పాఠకుల దృష్టిని ఆకర్షించిందని చెబుతున్నారు.

వాస్తవానికి ఇది బ్రిటీష్ రచయిత్రి కేటీ బ్రెంట్ (Katy Brent) రచించిన డార్క్ కామెడీ, సైకలాజికల్ థ్రిల్లర్ నవల. ఈ కథలో కిట్టీ కాలిన్స్ (Kitty Collins) అనే యువతి ప్రధాన పాత్ర. మహిళలపై హింస, వేధింపులకు పాల్పడే పురుషులను లక్ష్యంగా చేసుకుని ఆమె చేసే చర్యలు, అనంతరం చట్టం నుంచి ఎలా తప్పించుకుంటుందనే అంశాన్ని పూర్తిగా కల్పిత కథ రూపంలో రచయిత్రి చిత్రీకరించారు. మహిళల భద్రత, లింగ వివక్ష, ఆన్‌లైన్ సంస్కృతి, సమాజంలోని అసమానతలను వ్యంగ్యాత్మకంగా ప్రస్తావించే ఫాంటసీ నవలగా దీనికి గుర్తింపు ఉంది.

ఈ వైరల్ వీడియో మరోసారి ఒక పుస్తకాన్ని కేవలం దాని టైటిల్ లేదా ముఖచిత్రం ఆధారంగా నిర్ణయించకూడదనే విషయాన్ని గుర్తు చేస్తోంది. పాఠకుల్లో ఆసక్తిని రేకెత్తించే ఉద్దేశంతో పెట్టిన ఈ బోల్డ్ టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సాహిత్యాభిమానులు మాత్రం పుస్తకం అసలు కథను తెలుసుకున్న తర్వాతే దానిపై అభిప్రాయం వ్యక్తం చేయాలని సూచిస్తున్నారు.