భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, జులై 2026, గురువారంభారత్ సమాచార్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి: ప్రతిమాసింగ్

ab8a511e-5706-47e5-90cd-6f3d39c7695d

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మరింత పురోగతి సాధించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. నిజమైన అర్హులైన నిరుపేదలకు మాత్రమే పక్కా ఇళ్లు అందేలా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై హౌసింగ్ పీడీతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండో విడతలో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.

లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లావ్యాప్తంగా 78 మంది మండల గెజిటెడ్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. మొబైల్ యాప్ ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న, గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలను గుర్తించి అర్హులను ఎంపిక చేయాలని పేర్కొన్నారు. అనర్హులు లబ్ధి పొందకుండా క్షేత్రస్థాయిలో పూర్తి పరిశీలన చేపట్టాలని ఆదేశించారు.

అనంతరం జిల్లాకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని మండలాల వారీగా సమీక్షించారు. గ్రౌండింగ్, బేస్‌మెంట్, స్లాబ్, రూఫ్ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పనుల పురోగతిని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. పేదలకు గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ మాణిక్యం, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల గెజిటెడ్ అధికారులు, డీఈలు, ఏఈలు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.