భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: భైంసా పట్టణంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కిందపడిన రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మాధవ్ సింగ్, ప్రియాంక దంపతులు బతుకుదెరువు కోసం భైంసా పట్టణానికి వలస వచ్చారు. మాధవ్ సింగ్ టైల్స్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య ప్రియాంక, ఇద్దరు కూతుళ్లతో కలిసి పట్టణంలోని రాహుల్ నగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో చిన్న కూతురు కీర్తి సింగ్ (2) బాల్కనీలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పట్టు తప్పి రెండో అంతస్తు నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మృతితో రాహుల్ నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ గారాల పట్టి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కలచివేశాయి.