భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, జులై 2026, శుక్రవారంభారత్ సమాచార్

మెదక్‌ను టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ

454f0cfa-315a-461e-bb8d-2b78d8af0e54

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి వేగం తీసుకురావడంతో పాటు జిల్లాను ప్రముఖ టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ టూరిజం కన్సల్టెంట్లు శవంతి గుప్తా, భువన్ మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం జిల్లాలోని పలు పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలి రోజు నర్సాపూర్ అర్బన్ పార్క్, పార్క్ కాటేజీలు, వెంకట్రావుపేట కోట, మెదక్ ఖిల్లా ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.

పర్యాటకులను ఆకర్షించేలా ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులను పరిశీలించిన అధికారులు, మరింత అభివృద్ధి చేయాల్సిన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. సహజ వనరులు, చారిత్రక విశిష్టత, పర్యాటక అవకాశాలను పరిశీలించిన అనంతరం సుందరీకరణ, వాకింగ్ ట్రాక్‌లు, వీక్షణ స్థలాలు, పార్కింగ్ సదుపాయాలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, దిశా సూచిక బోర్డులు, విద్యుత్ వెలుగులు, పిల్లల వినోద సదుపాయాలు, భద్రతా చర్యలను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

నర్సాపూర్ అర్బన్ పార్క్, పార్క్ కాటేజీలను కుటుంబ పర్యాటకం, వివాహాలు, వినోద కార్యక్రమాలకు అనువుగా అభివృద్ధి చేయడంతో పాటు వెంకట్రావుపేట కోట, మెదక్ ఖిల్లా చారిత్రక వైభవాన్ని దేశ, విదేశాల పర్యాటకులకు పరిచయం చేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా పర్యాటక శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సమన్వయం చేస్తూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేసే అవకాశాలను కూడా పరిశీలించారు.

పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానిక కళలు, సంస్కృతి, హస్తకళలు, చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలో మెదక్ జిల్లాను ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతతో చర్యలు చేపడుతోందని తెలిపారు. ఈ పరిశీలనలో జిల్లా పర్యాటక శాఖ అధికారి రమేష్ గంగాల, ఈడీఎం సందీప్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్, పర్యాటక శాఖ ప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.