భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూర్ మండలం ముషిపట్ల గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఎల్నినో వాతావరణ పరిస్థితులు, వాటి ప్రభావం మరియు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు సాగు విధానాలను మార్చుకుని పంట నష్టాలను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యవసాయ నిపుణుల సూచనలను ఆసక్తిగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి వి. కీర్తి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున అధిక నీటి అవసరం ఉన్న పంటల సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే కంది, చిరుధాన్యాలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ పంటలు రైతులకు తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి, స్థిరమైన ఆదాయాన్ని అందించే అవకాశముందని తెలిపారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ సూచనలను పాటించడం ద్వారా రైతులు నష్టాలను నివారించవచ్చని వివరించారు.
వ్యవసాయ అధికారుల సూచన మేరకు ముషిపట్ల గ్రామానికి చెందిన రైతులు పైళ్ల వెంకట్ రెడ్డి, కొల్లు లక్ష్మయ్య పత్తి సాగుకు బదులుగా కంది సాగును ఎంచుకోవడాన్ని అధికారులు అభినందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారు తీసుకున్న నిర్ణయం ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇదే తరహాలో ఇతర రైతులు కూడా తమ ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.
ప్రభుత్వం కంది సాగును ప్రోత్సహించే ఉద్దేశ్యంతో PRG-176 రకం కంది విత్తనాలను సబ్సిడీపై అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల రైతులు అనాజీపురం రైతు వేదికలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ)ను సంప్రదించి సబ్సిడీ విత్తనాలను పొందాలని సూచించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు వాతావరణానుకూల పంటల సాగు ద్వారా స్థిరమైన ఆదాయం సాధించాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో ఏఈఓలు జి. కళ్యాణి, జి. సోమప్పతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.